Friday, 26 June 2015

Telugu Short Stories

                         తెలుగు కధలు 

1) పందెం :-


ఒక రాజ్యంలో ఇద్దరు సామంత రాజుల మధ్య సరిహద్దు తగాదాలుండేవి. ఆ సరిహద్దు ప్రాంత వాసులు ఎవరికి పన్నులు కట్టాలో తెలీక కట్టడం మానేశారు. ఆదాయాం తగ్గిపోవడంతో సామంతరాజులు ఇద్దరూ మహారాజుని ఆశ్రయించారు. ఇలాంటి చిన్న చిన్న తగాదాలు నా దాకు తీసుకురాకండి, మీరే సామరస్యంగా పరిష్కరించుకోండి అని మహారాజుగారు తేల్చేశారు.
పెద్దల సహకారంలో ఇద్దరు సామంత రాజులు ఒక అంగీకారానికి వచ్చేరు.
ఇరువైపు రాజ్యాలనుంచి ఇద్దరు బలశాలురు కోడి కూతతో బయలుదేరి సూర్యాస్తమం దాక ఎంత దూరం పరిగెడతారో అంత ప్రాంతం వాళ్ళది అని నిర్ణయించుకున్నారు. మంచి రోజు నిర్ధారించుకున్నారు. రెండు రాజ్యాల వళ్ళూ తమ తమ బలశాలులని యెంచుకున్నారు.
పందెం ముందు రాత్రి ఒక రాజ్యం వారు రహస్యంగా రెండొవ రాజ్యం కోడిని బాగా మేపేరు. తిని, తినీ ఆ కోడి బద్దకంతో బాగా నిద్రపోయి పొద్దున్న లేవలేదు, కూత పెట్టలేదు. ఆ రాజ్యం వాళ్ళు నిద్రలేచి, కోడిని లేపి, కూత పెట్టించే లోపు వేరే రాజ్యం బలశాలి చాలా దూరం వచ్చేసాడు. పొరుగు రాజ్యం పొలిమేరల దాక పరిగెట్టాడు.
అతన్ని బ్రతిమాలుకుంటే, నన్ను ఎత్తుకుని ఎంత దూరం పరిగెడితే ఆ ప్రాంతం నీకే అన్నాడు. ఈ రాజ్యం బలశాలి అతన్ని ఎత్తుకుని నడవడం మొదలెత్తాడు కానీ ఎంతో దూరం వెళ్ళకుండానే తెల్లారిపోయింది.
రెండు రాజ్యాల మధ్యలో గొడవ మొదలయ్యింది. విషయం తెలిసిన పెద్దలు పందెం రద్దు చేసారు.
ఆ ప్రాంతం ఎవరిదో ఇప్పతికి తేలలేదు. ఆ ప్రదేశాన్ని ఇప్పటికీ “పందెం పాలెం” అంటారు.



 2. అన్నా గోపాలా! :-

      ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి తన బిడ్డ గోపీతో వుండేది. ఆమెకు భర్త లేడు, ఒక్కడే పిల్లాడు. అన్నెం పున్నెం యెరుగని బాలుడు.
ఆ తల్లి చాలా కష్టాలు పడేది పిల్లవాడిని పోషించడానికి. భగవతుడిని నమ్ముకుని బ్రతికేది. వూరికి దూరంగా వున్న బడిలో గోపీ చదువుకునేవాడు. రోజు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడు. సాయంత్రం చింతతోపు లోంచి నడుచుకుంటూ ఇంటికి రావటానికి చాలా భయ పడేవాడు. వేరే పిల్లలంతా తల్లి-తండ్రులతోనో, బళ్ళల్లోనో వచ్చేవారు.
ఒక రోజు గోపీ తన తల్లితో అన్నాడు, “అమ్మా నువ్వు రోజూ నాకు పెరుగన్నమే పెడతావు, నేనేమీ పంచభక్ష్య పరమాన్నాలు అడగటం లేదు. కానీ రోజు చింతతోపు లోంచి రావాలంటే చాలా భయమేస్తుందమ్మా! నువ్వు రోజూ నాకు తోడు రాలేవా?”
“నాయనా! నీ పేరే గోపీ, గోపాల క్రిష్ణుడి పేరు పెట్టుకున్నాను. ఆయనే నీకు దిక్కు. భగవంతుడే మనకు రక్ష! భయం కలిగినప్పుడల్లా, “అన్నా! గోపాలా!” అని తలుచుకో, ఆయనే చూసుకుంటాడు అంతా.” అని ధైర్యం చెప్పింది.
ఆ మాటను అక్షరాలా పఠించేవాడు గోపీ. సాయంత్రాలు భయమేసినప్పుడల్లా, “అన్నా! గోపాలా!” అని తలుచుకునేవాడు. ధైర్యంగా భయం లేకుండా చింతతోపు దాటుకుని ఇంటికి వచ్చేసేవాడు.
ఒక రోజు బడిలో అయ్యవారు తన కూతురి పెళ్ళికి అందరినీ ఆహ్వానించాడు. అందరూ పిల్లలు తల్లి తండ్రులని అడిగి బహుమతులు తీసుకుని వెళ్ళాలని నిశ్చయించుకున్నారు.
సాయంత్రం ఇంటికి వస్తూ పిల్లాడు, “అన్నా! గోపాలా!” అని పిలిచాడు. “ఏం బహుమతి తీసుకుని వెళ్ళాలి, పాపం మా అమ్మ ఏం ఇవ్వగలదు?” అని అడిగాడు. అమ్మ ఏమిస్తే అదే సరిలే అనుకున్నాడు.
పెళ్ళిరోజు చక్కగా స్నానం చేసి, వున్న వాటిల్లో మంచి బట్టలు వేసుకున్నాడు. వాళ్ళ అమ్మ ఇచ్చిన చిట్టి పిడతలో పెరుగు జాగ్రత్తగా పట్టుకెళ్ళాడు. అందరూ ఖరీదైన బహుమానాలు తీసుకుని వచ్చారు. కొంత మంది పిల్లలు గోపీ తెచ్చిన బహుమానం చూసి నవ్వేరు. కాని అయ్యవారు చాలా ఆప్యాయంగా గోపీని ఇంట్లోకి రమ్మని, ఆ చిట్టి పిడతని తీసుకుని పక్కగా పెట్టారు. గోపీని కూడ అందరి లాగానే సత్కరించారు. విందులో అందరినీ కూర్చోమన్నారు.
పప్పూ, కూరలూ, పులుసులూ ఆరగించారు. పులిహోరా, మిఠాయివుండలూ, జాంగ్రీలూ వగైరా ఆస్వాదించారు. చివరిగా పెరుగు వడ్డించ మన్నారు.
చిట్టి పిడతలో వున్న పెరుగు ఒక్కరికి సరిపోతుందనుకుని, అయ్యవారు ముందు ఆ గిన్నిలోని పెరుగు ఒకరి విస్తరలో వంపేరు.
ఆశ్చర్యం! తిరిగేసరికి ఆ పిడతలో మళ్ళి పెరుగు నిండిపోయింది.
ఈ లోపల ఆ పెరుగు తింటున్న వ్యక్తి, “అద్భుతం! అమోఘం! ఈ పెరుగేంటి ఇంత రుచిగా వుంది, ఎక్కడనించి తెప్పించారు?” అన్నాడు.
వేరే వాళ్ళంతా, “యేది, మాకు వడ్డించండి, మేమూ చూస్తాము”, అన్నారు.
అయ్యవారు పిడతలో పెరుగు అందరికి వడ్డించడం మొదలెట్టారు. అసలు యెంత మందికి అందులోంచి పెరుగు వడ్డించినా, అందులో మళ్ళీ మళ్ళీ పెరుగు నిండిపోయింది.
వచ్చిన వారంతా కూడా ఆశ్చర్యపోయారు. ఈ మహిమ యేమిటొ అని అయ్యవారు గోపీని అడిగారు. గోపీ జరిగిందంతా చెప్పాడు. అందరూ “యేది, అన్నా! గోపాలా! అని పిలూ, మేమూ చూస్తాము!” అన్నారు.
అయ్యవారు అందరిని మందలించారు. “మనలాంటి వాళ్ళకు కనిపించాల్సిన అవసరం దేవుడికిలేదు. ఈ బాలుడి వల్ల మనం ఈ రోజు ఈ మహిమ చూడగలిగాము.” అన్నారు.
అందరూ ఆకాశం వైపు చూశారు. నీలంగా నల్ల కృశ్ణుని నీల పీతంబరమా అన్నట్టు ఆకాశంలో కనబడింది.


3. అలవాటు :-


                           ఒక వూళ్ళో సుబ్బమ్మ సూరమ్మ అని ఇద్దరు ఆడవాళ్ళుండేవారు. సుబ్బమ్మ పూలు అమ్ముకునేది. సూరమ్మ చేపలు అమ్ముకునేది. వేరే వాళ్ళను చూసే వారెవరూ లేకపోవడంతో కష్ట పడాల్సి వచ్చేది.
ఒక రోజు వాన పడడంతో ఆలస్యం అయిపోయింది. పూట కూళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఆ రాత్రికి తలదాచుకోవాలని నిశ్చయించుకుని, పెద్దమ్మ ఇంట్లో ప్రవేశించారు. తినడానికి పెట్టి, నిద్రపోవడానికి గది చూపించింది పెద్దమ్మ.
సూరమ్మ పూల వాసన భరించలేక పోయింది. ఎంత ప్రయత్నించినా నిద్రపోలేక చాలా అవస్థ పడింది. వెళ్ళి తన చేపల బుట్ట తెచ్చుకుని, తలవైపు పెట్టుకుని హాయిగా నిద్రపోయింది. తెల్లవారి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు.
పెద్దమ్మ ఆశ్చర్యపోయింది. సువాసనలు వెదజల్లే పూలు ఎవరికి నచ్చవు? అవి సూరమ్మకి ఎలా వెగటయ్యాయని పెద్దమ్మ చాలా సేపు ఆలోచించింది.
మీకేమైన తెలిసిందా?
సూరమ్మ పొద్దస్తమానూ చేపలతోనే గడుపుతుంది కదా! అందుకే ఆ వాసనే అలవాటు అయిపోయింది. పూల సువాసనని ఆస్వాదించలేదు.

4. నిరక్షర కుక్షి :-


                    అనగనగా ఒక జమీందారు పొరుగూరిలో వున్న తన కూతురికి ఒక బుట్టలో నిండా మామిడిపళ్ళు పెట్టించి, నమ్మకస్తుడైన నౌకరుకిచ్చి పంపించాడు.
దారి మధ్యలో ఆయాసం తీర్చుకోడానికి సేవకుడు బుట్టను దించి, ఒక చెట్టు నీడలో కాస్సేపు విశ్రమించాడు.
ఘుమ ఘుమలాడి పోతున్నాయి ఆ బుట్టలో మామిడిపళ్ళు. ఒక పక్క యెండా, మరో పక్క ఆకలి. ఆ పైన ఆ ఘుమ ఘుమలూ. సేవకుడు ఉండ పట్ట లేక పోయాడు.
జమీందారు పళ్ళతో ఇచ్చిన లేఖను ఒక గొయ్యి తీసి కప్పెట్టాడు. జిహ్వ చాపల్యంలో ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు పళ్ళు తినేసాడు. హాయిగా ఒక చిన్న కునుకు తీసాడు.
యేమి ఎరగనట్టు గొయ్యిలోంచి లేఖని తవ్వి తీసుకుని, బుట్టనెత్తుకుని బయలుదేరాడు.
జమీందారు కూతురు బుట్టనీ, లేఖనీ తీసుకుంది. తండ్రి పంపించిన లేఖ చదివింది. పళ్ళు లెక్ఖబెట్టించింది.
“నాలుగు పళ్ళు తక్కువున్నాయేమిటి?” అని నిలదీసింది. “నువ్వేమైన తిన్నావ?”
“అయ్యో! అయ్యో! ఇదెక్కడ విడ్ఢూరం తల్లీ! నేలలో పాతిపెట్టాను కదా, ఈ లేఖ ఎలా చూసింది?” అని లబో దిబో మని తల కొట్టుకున్నాడు.
జమీందారు కూతురికి నవ్వొచ్చేసింది. సేవకుడిని క్షమించేసింది.
కాని, చూసారా , మూర్ఖుడైన ఆ నౌకర్కి చదువు కూడా రాకపోతే ఎంత అనర్ఘమో?

5. అఙ్నానం, మూర్ఖత్వం :-


                             అనగనగా ఒక మడుగులో చాలా కప్పలు జీవిస్తూ వుండేవి. బెక బెకలతో ఆ మడుగు ధ్వనిస్తూ వుండేది.ఒక రోజు ఒక పిల్ల కప్ప తన తల్లి కప్పని బయటికి వెళ్ళడానికి అనుమతిని అడిగింది. 
              తల్లి కప్ప వెంటనే – “చాలా దూరం వెళ్ళితే తప్పి పోతావు. ఇక్కడిక్కడే తిరుగు – నాకు నిన్ను వెతకటం కష్టం.” అంది. పిల్ల కప్ప పట్టు వదలకుండా చాలా సేపు బతిమాలింది. చివరికి విసుకు చెంది, తల్లి కప్ప కసురుకుంది. “నేను మా అమ్మ మాట విన్నాను, ఎప్పుడూ ఈ మడుగు దాటలేదు. నువ్వూ నా మాట విను” అంది.
పిల్ల కప్ప చాలా మొండిది. అమ్మ మాటలకు ఇంకా పంతం పట్టింది. “అనుమతిని అడిగితే ఇలాగే వుంటుంది. అనుమతినే కదా అడిగాను, ఎందుకు అమ్మ అంతా విసుక్కోవాలి” అని తనలో తను గొణుగ్గుంటూ మడుగంతా తిరుగుతూ అంచుల దెగ్గిరకి వెళ్ళిపోయింది.
ఎదురుగా గట్టు మీద ఒక మనిషిని చూసింది. పిల్ల కప్ప అదే మొదటి సారి ఒక మనిషి ని చూడటం. ఆ ఎత్తూ ఆకారం చూసి చాలా జడుసుకుంది. ఖంగారుగా ఈదుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చేసి, చూసింది చెప్పింది.
తల్లి కప్ప కూడా ఏనాడూ మనిషిని చూడలేదు గా, అందుకే, “ఎంత లావున్నాడు?” – పొట్ట వుబ్బించింది. “ఇంత వున్నాడా?”
“ఊహూ” అని అడ్డంగా తల ఊపింది పిల్ల కప్ప.
“ఇంత?” అని ఇంకా పొంగించింది తల్లి.
“ఊహూ” అని మళ్ళి అడ్డంగా తల ఊపింది పిల్ల కప్ప.
“ఇంత? పోనీ ఇంతా? ఇదిగో చూడు, ఇంతా?” అంటూ పొట్ట వుబ్బించి, వుబ్బించి, పొట్ట పేలి క్రింద పడిపోయింది తల్లి కప్ప.

6. ఆకాశం కథ :-


                            చాలా, చాలా, చాలా ఏళ్ళ క్రితం, వందల వేలు, లక్షలు, కోట్లు యేళ్ళ క్రితం ఆకాశం ఇంకా దెగ్గిరగా వుండేది మనకి. ఇంత దూరంగా వుండేది కాదు.
ఆకాశం కాప్లాదారులు సూర్య చంద్రులు, వారికి పెద్ద దిక్కు ఒక ముసలి అవ్వ.
సూర్యుడు వేకువనే లేచి వేడి వేడి అన్నం అవ్వ వండగానే తినేసి, ఆకాశం మీదకు వెళ్ళి, పగలంతా కాపలా కాసి సాయంత్రం ఇంటికి వచ్చి, మళ్ళి అవ్వ వండిన వేడి అన్నం తినేసి పడుక్కునేవాడు.
చంద్రుడు ఇంకా పొద్దు వుండంగానే చల్ల అన్నం తినేసి రాత్రంతా కాపల కాసి చీకట్లో తెల్లవారకుండా ఇంటికి తిరిగి వచ్చి మళ్ళి చల్ల అన్నం తినేసి పడుక్కునేవాడు.
ఒక రోజు పొద్దున్నే సూర్యుడు తన విధి నిర్వర్తించడానికి బయలుదేరాడు. గబ గబా  చంద్రుడు వచ్చేస్తాడని వెళ్ళి పోయాడు.
ఇంకా చంద్రుడు రావాలి భూమి మీదకు. ఈ లోగా అవ్వ ఒక పని అయినట్టుంటుందని, చీపురు తీసుకుని ఇల్లు ఊడవడం మొదలెట్టింది. తుడుస్తూ తుడుస్తూ వీపు యెత్తింది. యేదో తగిలినట్టు అనిపించింది. చూస్తే ఆకాశం వీపుకు తగులుతోంది. చీపురు తీసుకుని కోపంగా, గట్టిగా, ఒక్క తోపు తోసింది.
బాధలో, ఉక్రోశంలో, ఆకాశం దూరంగా, ఇంకా దూరంగా, చాలా దూరంగా జరిగిపోయింది.
అంత యెత్తునుంచి సూర్య చంద్రులు దిగలేరు కదా, అందుకే ఆకాశంలోనే వుండి పోయారు.

7. ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం :-


                 ఒక నాడు ఓ కోతి అడవిలో గెంతుతూ వుంటే దాని కాలికి ఒక ముల్లు గుచ్చుకుంది. అది వూళ్ళోకొచ్చి ఒక మంగళిని ఆశ్రయించింది. మంగళి చక్కగా ముల్లు తీసి విసిరేశాడు. తిరిగి చూసేసరికి కోతి తన కత్తి తీసుకుని పారిపోవడం గమనించాడు.
“ఓ కోతి! ఓ కోతి! నా కత్తి!” అన్నాడు.
కోతి వెనక్కి తిరిగి, “ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం”, అని వెక్కిరించి పారిపోయింది.

కత్తి తీసుకుని కోతి ఊళ్ళో తిరగడం మొదలుపెట్టింది.
ఒక వ్యక్తిని చేతితో కొబ్బరి మట్టలు కొట్టడం చూసింది. జాలిపడి అతని చేతికి కత్తి అందించింది. ఆ మనిషి సంతోశంగా మట్టెలు కత్తితో కొడుతుంటే, పక్కన పడేసిన మట్టెలను కోతి తీసుకుని ఉడాయించింది.
“ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం!
కత్తి పోయి మట్టలు వచ్చే ఢాం ఢాం ఢాం!” అని పాడుకుంటూ తన దారిని వెళ్ళిపోయింది కోతి.
దారిన ఒక బెల్లం కాచే ఆసామి నేల మీద బెల్లం అచ్చులు వేయడం చూసి, ఆ మట్టలు అతనికి ఇచ్చింది. ఆసామి మట్టలు పరుచుకుని బెల్లం అచ్చులు వాటిమీద పెట్టడం మొదలు పెట్టాడు. అలవటు ప్రకారం కోతి బెల్లం అచ్చులు తీసుకుని, వెక్కిరిస్తూ పారిపోయింది.
“ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం!
కత్తి పోయి మట్టలు వచ్చే ఢాం ఢాం ఢాం!
మట్టలు పోయి అచ్చులు వచ్చే ఢాం ఢాం ఢాం!”
“న బెల్లం అచ్చులు! దొంగ కోతి!” అని లబోదిబోమంటూ ఆసామి చూస్తూ వుండిపోయాడు.
కొంచం దూరానికి ఒక పేదరాశి పెద్దమ్మ బెల్లం లేని చప్పిడి బూరెలు చేస్తూ కనిపించింది. కోతి ఆమెకు బెల్లం అచ్చులు ఇచ్చింది. పెద్దమ్మ బెల్లం బూరెలు చేయడం మొదలెట్టింది. అవి చేయంగానే కోతి వండి పెట్టిన బూరెలు తీసుకుని పరిగెట్టింది.
“ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం!
కత్తి పోయి మట్టలు వచ్చే ఢాం ఢాం ఢాం!
మట్టలు పోయి అచ్చులు వచ్చే ఢాం ఢాం ఢాం!
అచ్చులు పోయి బూరెలు వచ్చే ఢాం ఢాం ఢాం!”
కొంత సేపటికి కోతికి గోవుల కాపర్లు ఇద్దరు యెదురయ్యారు. వాళ్ళకి బూరెలు ఇచ్చింది. వాళ్ళు ఇష్టంగా బూరెలు తింటూ మయిమరిచిపోయారు. కోతి గోవును తోలుకుని వెళ్ళిపోయింది.
“కోతి! కోతి! మా గోవును ఇచ్చేయి!” అని చాలా దూరం కాపర్లు తరిమేరు. కాని కోతి వాళ్ళకు చిక్కలేదు.
“ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం!
కత్తి పోయి మట్టలు వచ్చే ఢాం ఢాం ఢాం!
మట్టలు పోయి అచ్చులు వచ్చే ఢాం ఢాం ఢాం!
అచ్చులు పోయి బూరెలు వచ్చే ఢాం ఢాం ఢాం!
బూరెలు పోయి గోవు వచ్చే ఢాం ఢాం ఢాం!”
రోజంతా పడ్డ శ్రమకి కోతి బాగా అలిసిపోయింది.
“ఆబ్బ! చాలా కశ్ట పడ్డాను ఇవాళ, వొళ్ళంతా పులిసిపోయింది. వెణ్ణీళ్ళు కాచు, స్నానం చేసి విశ్రామిస్తాను,” అని గోవును ఆఙాపించింది.
గోవుకి బాగా కోపమొచ్చింది. సలసలా మరిగించిన నీళ్ళను తీసుకొచ్చి కోతి వంటిమీద భళ్ళున పోసేసింది. కోతి కుయ్యో మర్రో మని ఏడుస్తుంటే; తోలు వూడిన కోతిని చూసి నవ్వుకుంటూ ఆవు తన మందలోకి వెళ్ళిపోయింది.

8.నాణాల సంచి :-


                     ఒక సారి ఒక చమురు వ్యాపారికి ఒక కసాయి వాడికి చాల పెద్ద గొడవ ఐపోయింది. విషయం తేలక ఇద్దరు బీర్బల్ దగ్గరకు వెళ్ళారు.
తగువు తీర్చమని బీర్బల్ ని అడిగారు.
“అసలు గొడవ యేమిటి?” అని బీర్బల్ అడిగాడు.
అప్పుడు కసాయి వాడు ఇలా చెప్పాడు, “నేను మాంసం అమ్ముకుంటుంటే ఈ చమురు వ్యాపారి నా దుకాణానికి వచ్చి చమురు పోస్తానన్నాడు. పాత్ర తీసుకు రావడానికి నేను లోపలకి వెళ్ళి నప్పుడు ఇతను నా నాణాల సంచి తీసుకుని అది తనదే అని గొడవ చేస్తున్నాడు. నా డబ్బు సంచి నాకు ఇప్పించండి”
వెంటనే ఆ చమురు వ్యాపారి, “లేదు! అతను చెప్పేవన్నీ అబద్ధాలు. ఆ సంచి నాదే. నేను నాణాలు సంచి లోంచి తీసి లెక్ఖ పెడుతున్నాను. అది చూసి ఇతను దురాశతో నా సంచి కాచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. న్యాయం చెప్పండి.” అన్నాడు.
బీర్బల్ యెన్ని సార్లు అడిగినా వాళ్ళిద్దరు చెప్పిన మాటే మళ్ళి మళ్ళి అదే మాట చెప్ప సాగారు.
ఈ గమ్మత్తైన సమస్యకి బీర్బల్ ఒక యుక్తిని అలోచించాడు.
ఒక పెద్ద పాత్రలో నీళ్ళు తెప్పించాడు. ఆ నీళ్ళల్లోకి సంచిలో నాణాలు వేశాడు. వెంటనే ఆ పాత్రలో నీళ్ళపైన పలచగా నూనె తేలింది.
ఆ తెట్టు చూసిన వెంటనే ఆ సంచి చమురు వ్యాపరిదని అందరూ గ్రహించారు.
బీర్బల్ సంచిలో మళ్ళి నాణాలు నింపి చమురు వ్యాపరికి ఇచ్చేసాడు. ఆ కసాయిని కఠినంగా శిక్షించాడు.

9.అత్తారింటికి దారేది? :-


                      ఒక సంవత్సరం వానలు ఉధృతంగా పడడంతో యమున నది పొంగి పొర్లింది. రాత్రి అంతా సన్నాటంగా ఉండగా యమున నది హోరు చాలా గట్టిగా వినిపించింది.
యమున నది తీరన్న వున్న అక్బర్ భవనంలో రాత్రి మహారాజుకి ఆ హోరు నది యేడుస్తున్నట్టు అనిపించింది. అక్బర్కి నిద్రాభంగం కలిగింది. చాలా సేపు కిటికీ దెగ్గర నిలబడి, “ఇదేమిటి, యమునా నది ఇంత గట్టిగా యేడుస్తోంది” అనుకున్నాడు. యెంత సేపు ప్రయత్నించినా నిద్రపోలేక పోయాడు.
మరునాడు సభలో సభికులందరికి రాత్రి జరిగిన విషయము చెప్పి, “మీలో యెవరైన యమునా నదికి కలిగిన కష్టమేమిటో చెప్ప గలరా?” అని అడిగారు.
సభికులు తెల్లబోయి, సమధానము తోచక ఒకరి మొఖం ఒకరు చూసుకుని మిన్నకుండిపోయారు.
బీర్బల్ ముందుకొచ్చి, “మహారాజా, ఒక సారి వింటే కాని నేను చెప్పలేను” అని అన్నాడు.
అక్బర్ వెంతనే బీర్బల్ను ఆ రాత్రి అంతహ్పురానికి రమ్మని ఆహ్వానించాడు.
రాత్రి బీర్బల్ అక్బర్ గదిలో కిటికీ దెగ్గర నిలబడి ఆ యమ్నునా నది హోరును విన్నాడు.
విషయమర్ధమయ్యింది.
“మహారాజా, యమునా నది తన తండ్రి హిమాలయ పర్వతాన్ని వదిలి తన అత్తరిల్లు (సముద్రం) దారి వెతుక్కుంటూ వెళ్తోంది. తండ్రిని, పుట్టింటిని వదిలి వెళ్తున్నందుకు దుఖంతో యేడుస్తోంది.” అని మరునాడు సభలో విశ్లేషించాడు.
సభికలందరూ ఈ విషయం విని బిగపట్టిన ఊపిరి వదిలారు.






No comments:

Post a Comment