Friday 26 June 2015

Telugu Short Stories2

                                         

                         తెలుగు కధలు-2 



                           500 సంవత్సరాల క్రితం విజయనగరమనే సామ్రాజ్యాన్ని శ్రీ కృష్ణదేవరాయులు పరిపాలించేవారు. ఆయిన ఒక రోజు నిద్రలొ ఒక కల కన్నారు. ఆ కలలో ఆయినకొక అందమైన భవనము కనిపించింది. ఆ భవనం ఆకశంలో తేలుతూ, లక్ష దీపాలతో చాలా అద్భుతంగా వుంది. తలుచుకుంటే చాలు, మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయారు. మొన్నాడు సభలో ఆయిన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయిన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపేరు. అది విన్న వారంత అలాంటి భవనమును ఎలా కట్టగలము – అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. రాయులు కోపగించుకుని – “అదంతా నాకు అనవసరం. మీరేంచేస్తారో నాకు తెలీదు కాని నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను లక్ష వరహాల బహుమానము ఇస్తాను – లేదా మీరందరు నాకు కనిపించకండి” అని ఆఙాపించారు. విన్నవారంత నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయులు ఆ కలను మరువలేదు.
ఒక రోజు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన గెడ్డం, జుత్తు, మీసాలతో పాపం అతి కష్టం మీద కర్ర తో నడుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని రాయులవారి ని ప్రార్థించాడు. “నీకేమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను న్యాయం చేస్తాను” అని రాయులు హామి ఇచ్చారు.
“నా దెగ్గిర నూరు నాణ్యాలున్నాయి స్వామి, అవి ఒకరు దొంగలించుకుపోయారు. నాకు వారెవరో తెలుసు, నా నాణ్యాలు అడిగి ఇప్పించండి” అని ఆ వృద్ధుడు విన్నపించాడు.
శ్రద్ధగా విన్న రాయులు ఈ దొంగతనం యెవరు చేసారు, యెక్కడ చెసారు అని ప్రశ్నించారు.
వృద్ధుడు తడపడడం చూసి “నీకేమి భయం లేదు, చెప్పు” అని రాయులు ప్రోత్సహించారు.
“నా నూరు నాణ్యాలు దొంగలించింది మీరే స్వామి” అన్నాడు వృద్ధుడు. “నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచారు.”
రాయులకు చాలా కోపం వచ్చింది. “యేమిటీ వెటకారం! కలలో జరిగినది నిజమనుకుంటే ఎలా?” అని కోపంగా అడిగారు. ఈ మాట విన్న వృద్ధుడు తన గెడ్డం, మీసం తీసేసి, కర్రను పక్కకు పడేసి, పగటి వేశాన్ని విప్పేసాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణ.
“క్షమించండి స్వామి – మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేసాను” అన్నాడు తెనాలి.
రాయులకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా ఆయినకు అర్ధమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయిన చాలా అభినందించారు.

2. బీర్బల్ జ్వరం :-


           ఒక సారి బీర్బల్కి బాగా జ్వరమొచ్చి కొన్ని రోజులు రాజసభకు వెళ్ళలేదు. అక్బర్కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. ఇన్ని రోజులు బీర్బల్ కనిపించకపోతే ఆత్రుతతో బీర్బల్ని చూడడానికి అతని ఇంటికి వెళ్ళారు.
బీర్బల్ జ్వరం వల్ల నీరశించి, చిక్కి శైల్యం అయ్యి ఉన్నాడు.
అక్బర్కి అతని అవగాహనా శక్తులు తగ్గాయేమో అని సందేహమొచ్చింది. అందుకే బీర్బల్ మంచినీళ్ళ కోసం పక్క గదిలోకి వెళ్ళినప్పుడు అక్బర్ అతని చేతి రూమాలు తీసి ఒక మంచం కోడు కింద పెట్టాడు.
తిరిగి వచ్చి బీర్బల్ మంచం మీద పడుక్కుంటే యేదో తేడాగా ఉన్నట్టు అనిపించింది.
అక్బర్ యేమి యెరగనట్టు బీర్బల్తో కబుర్లు చెబుతూ కూర్చున్నారు. కాని బీర్బల్ మట్టుకు ధ్యాసగా వినలేకపోయాడు.
కొంతా సేపు ఇలా సాగాక, అక్బర్ బీర్బల్ పరధ్యానానికి కారణం యేమిటని అడిగాడు.
“ఈ గదిలో యేదో మారినట్టుంది,” అని బీర్బల్ జవాబు చెప్పాడు.
“మారిందా? యేమిటి మారిందంటావు?” అని అక్బర్ అన్నారు.
“ఈ మంచం ఒక మూల యెత్తుగా వున్నట్టుంది,” అని అన్నాడు.
“జ్వరమొచ్చి నప్పుడు అలా అనిపిస్తుంది,” అని అక్బర్ జాలి మొహం పెట్టి అన్నారు.
“మహారాజా! నా శరీరానికి జ్వరమొచ్చింది కాని నా మెదడుకు రాలేదు!” అని బీర్బల్ నవ్వుతూ అక్బర్తో అన్నాడు.
అక్బర్ కూడా నవ్వి అతను బీర్బల్కి పెట్టిన పరీక్ష గురించి చెప్పారు.

3. విష్ణు మహిమ :-


          ఒక రోజు అక్బర్ బీర్బల్ ని సరదాగా ఆట పట్టించాలని అనుకున్నారు.
“బీర్బల్, నాకొక సందేహముంది, తీరుస్తావా? అలనాడు విష్ణుమూర్తి ఒక ఏనుగు ఆర్తనాదాలు విని వెంటనే దాన్ని రక్షించడానికి పరిగెట్టాడని నేను వేద పురాణాలలో వుందని విన్నాను. యెందుకలా? అక్కడ సేవకులెవరూ లేరా?” అని అక్బర్ బీర్బల్ ని అడిగారు.
బీర్బల్ ఇలా జవాబు చెప్పాడు, “సమ్రాట్, మీ సందేహం నేను సమయమొచ్చినప్పుడు తీరుస్తాను!”
కొన్ని రోజులు గడిచాయి. బీర్బల్ ఒక పనిమనిషిని పిలిచి ఆమె చేతికొక మైనపు బొమ్మను ఇచ్చాడు. బొమ్మ అచ్చు ఒక శిశువు రూపంలో ఉంది. “ఈ రోజు నేను మహారాజుతో తోటలో ఉన్నప్పుడు, ఈ బొమ్మని తీసుకుని నీట్లో పడిపోయినట్టు నటించు, నీకు మంచి బహుమానమిప్పిస్తాను,” అని ఆ పనిమనిషికి చెప్పాడు.
అలాగే పనిమనిషి సాయంత్రం అక్బర్, బీర్బల్ తోటలో విహరిస్తుంటే తోట నడిమధ్య ఉన్న మడుగులో కాలు జారి పడిపోయినట్టు నటించింది. తనతో పాటు ఆ శిశువు బొమ్మకూడ నీళ్ళల్లో పడిపోయింది.
అక్బర్ ఈ దృశ్యం  చూడగానే వెంటనే నిండు బట్టలతోనే నీళ్ళల్లోకి దూకి ఆ శిశువు బొమ్మని కాపాడ సాగాడు.
బీర్బల్ మడుగు గట్టున నిలుచుని, “మహారాజా, యెందుకు మీరు నీళ్ళల్లో దూకరు? సేవకులని పురమాయిస్తే సరిపోయేది కదా?” అన్నాడు.
“ఒక శిశువు ప్రాణాపాయ స్థిథిలో కనిపిస్తే మీరు యెలా ముందూ వెనకా చూడకుండా ఆదుకోవాలనుకున్నారో, విష్ణుమూర్తి కూడా అలాగే తన భక్తుడైన ఆ ఏనుగుని కాపాడడానికి వెనకాడలేదు” అని చాలా తెలివిగా అక్బర్ సందేహం తీర్చాడు.

4. మనస్సాక్షి :-


ఒక సారి అక్బర్ మహారాజు ఉంగరం పోయింది. కోట మొత్తం వెతికినా కనిపించలేదు.
అప్పుడు అక్బర్ బీర్బల్ను దర్బారుకి పిలిపించి, “బీర్బల్, నా ఉంగరం కనిపించటం లేదు. సేవకులు కోటంతా వెతికేరు, ఐన దొరకలేదు. ఎవరో దొంగలించారని నా అనుమానం. దొంగలించిన వాళ్ళు మన సభలో ఎవరో అయ్యుండాలి, ఎవరో కనిపెట్ట గలవా?” అని అడిగారు.
బీర్బల్ ఒక నిమిషం అలోచించాడు. “ఇది చాలా సులువైన పని మహారాజా! దొంగలించిన మనిషి గడ్డంలో ఒక బియ్యపుగింజ వుంటుంది, అందరి గడ్డాలు పరీక్షిస్తే దొంగెవరో ఇట్టే కనిపెట్టచ్చు!” అన్నాడు.
వెంటనే సభలో ఒక వ్యక్తి తన గడ్డం తడువుకున్నాడు. ఇది చూసిన బీర్బల్ వెంటనే దొంగని పట్టించాడు.
అక్బర్ చాలా ఆశ్చర్యపోయారు. “బీర్బల్, నీకెలా తెలిసింది, దొంగ గెడ్డంలో బియ్యపుగింజ వుందని?” అని అడిగారు.
“మహారాజా, తప్పు చేసిన మనిషి మనస్సాక్షి ఎప్పుడు భయపడుతూ వుంటుంది. దొంగతనం చెయ్యనివాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని చూస్తుంటే, తప్పు చేసిన వాడు తన గడ్డం భయంతో తడుముకున్నాడు” అని బీర్బల్ వివరించాడు.
ఇలా బీర్బల్ మరొక్క సారి తన సమయస్ఫూర్తిని, తెలివితేటలని ప్రదర్శించాడు.

5. దొంగ ఎవరు? :-


      అక్బర్ బాద్ షా రాజ్యంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతని పనివాడు ఒక రోజు దొంగతనం చేసి, నగలు, రొక్కం తీసుకుని పారిపోయాడు.
కొన్ని రోజులయ్యాక, ఒక సారి ధనవంతుడు బజారులో తన పనివాడిని తిరుగుతూ చూసాడు. ఆ పనివాడు కూడ ధనవంతుడిని చూసాడు. యెక్కడా పారిపోవడానికి దారిలేదని గ్రహించి, వెంటనే ఆ ధనవంతుడిని గట్టిగా పట్టేసుకున్నాడు.
“దుర్మార్గుడా! దొరికావు! ఇప్పుడెలా పారిపోతావు? దొంగతనం చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? నా నగలు, రొక్కం తిరిగి ఇవ్వు!” అని అరవడం మొదలుపెట్టాడు.
ధనవంతుడు నిర్ఘాంత పోయాడు. “నేను దొంగతనం చేయడం యేమిటి, వెంటనే నా సొమ్ము నాకు ఇవ్వకపోతే నిన్ను రాజ భటులకు పట్టిస్తాను!” అని గొడవపడ సాగాడు.
బజారులోని కొందరు పెద్దమనుషులు ఇద్దరిని బీర్బల్ దగ్గరకి న్యాయం కోసం తీసుకు వెళ్ళారు.
బీర్బల్ యెదురుకుండా ఇద్దరు వారి వారి కథలను మళ్ళి చెప్పారు.
బీర్బల్ వెంటనే ఒక భటుడిని పిలిచి, “ఇద్దరిని ఒక కిటికీ దగ్గిరకి తీసుకెళ్ళి అందులోంచి తలలను బయట పెట్టమను” అన్నాడు.
ఇద్దరు కిటికి బయట తలలు పెట్టాక, బీర్బల్, “ఇప్పుడు పనివాడి తల నరికేయి!” అని ఆదేశించాడు.
ఈ మాట వినంగానే అసలు పనివాడు ఖంగారుగా తన తల లోపలకు లాగేసాడు. ఇలా బయటపడిపోయాడు.
ఇలా బీర్బల్ మళ్ళీ అతని చాకుచక్యం ప్రదర్శించుకున్నాడు.

6. తోటలో మొక్కలు; అడవిలో చెట్లు :-


అక్బర్ బాద్ షా తన ఇష్టమైన మంత్రి బీర్బల్ తో షికారుకు ఒక నాడు బయలుదేరాడు. దారిలో ఒక ఆటవిక స్త్రీ చెట్టుకింద కూర్చుని ఆయాస పడడం చూసారు.
కొంత సేపటికి తిరిగి కోట వైపు వెళ్తుంటే ఆ స్త్రీ ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డని గుడ్డల్లో చుట్టి, ప్రసవమైన ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి, తన దారిని చక చక బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది.
ఇది చూసిన అక్బర్ బాద్ షా బిడ్డను ప్రసవించడం అంత సునాయసమని అపోహ పడ్డారు.
ఇంటికి వచ్చి, గర్భవతి ఐన తన బేగంకి పరిచారకులు అవసరంలేదని, తన పనులు తనే చేసుకోవాలని చెప్పి, వాళ్ళను వేరే పనులు చేసుకోమని మళ్ళించారు.
నిండు గర్భవతి ఐన బేగం తన పనులు చేసుకోవటం అలవాటు లేక, చాలా ఇబ్బంది పడసాగింది.
తట్టుకోలేక ఒక రోజు బీర్బల్ను సహాయం అర్థించింది.
బీర్బల్ ఇంత నాజూకైన విషయం అక్బర్ బాద్ షా తో యెలా చెప్పాలని సతమతమయ్యాడు.
అలోచించగా ఒక ఉపాయం తట్టింది.
కోట లోని తోటమాలిని కొద్ది రోజులు మొక్కలకి నీళ్ళు పోయవద్దని చెప్పాడు.
రోజు తోటలో విహరించడం అలవాటైన అక్బర్ ఒక రోజు అలాగే తోటలో వుండగా మొక్కలు నీరసించి వాడిపోతూ వుండడం గమనించాడు. వెంటనే తోట మాలిని విషయం చెప్పమని ఆగ్రహించాడు.
తోట మాలి బీర్బల్ ఆదేశాననుసారం మొక్కలకు నీళ్ళు పోయటంలేదని చెప్పాడు.
క్రొధంతో అక్బర్ బీర్బల్ను పిలిపించాడు. “మొక్కలు నీళ్ళు లేకపోతే యెండిపోవ?” అని కోపంతో కేకలు వేయ సాగాడు.
బీర్బల్ అప్పుడు నిదానంగా, “బాద్ షా! అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు యే తోట మాలి సహాయం లేకుండా, రోజు నీళ్ళు పోయకుండ, పెరిగాయికద? అలాగే మరి మన కోట లో తోటలకి ఇంత మంది సేవకులు యెందుకు?” అన్నాడు.
వెంటనే అక్బర్కు ఙ్యానోదయమయ్యింది. బీర్బల్ సున్నితంగా ఇచ్చిన సూచనను గ్రహించి వెంటనే రాణి గారికి పరిచారకులను పురమాయించాడు.

7. అసలు యజమాని ఎవరు? :-


                     ఒక సారి ఒక సామంతరాజు బీర్బల్ తెలివితేటల గురించి విని ఆయనని చూడాలని ఒక రైతు వేషం ధరించి గుర్రం మీది రాజధాని వైపు బయలుదేరాడు.
దారిలో ఒక కుంటి వ్యక్తి రహదారులను సహాయమడుగుతూ కనిపించాడు. సామంతరాజు జాలి పడి ఆ వ్యక్తికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆగి ఆ కుంటి వ్యక్తిని పలకరించాడు. అతను రాజధాని వెళ్ళాలని చెప్పాడు.
సామంతరాజు వెంటనే కుంటి వ్యక్తిని గుర్రం యెక్కించి తను నడవ సాగాడు.
రాజధాని చేరాక ఆ కుంటి వాడు దిగడానకి ఇష్టపడలేదు. కేకలూ అరుపులూ మొదలపెట్టాడు. సామంతరాజు నిర్ఘాంతపోయి చూస్తుండగా చుట్టూర పది మంది చేరారు.
కింటివాడు చేరిన జనానికి తనదే గుర్రమని, ఆ రైతు వేశం లో వున్న సామంతరాజును కేవలం అతని పనివాడని చెప్పాడు. సామంతరాజు, కాదు, గుర్రం అతనిదని, సహాయం చేస్తే ఇలా ఇరుక్కున్నట్టు చెప్పాడు.
ఇద్దరు కలిసి అక్బర్ చక్రవర్తి దర్బారుకి న్యాయంకోసం వచ్చారు.
అక్బర్ బీర్బల్ను న్యాయం చెప్ప మన్నాడు.
బీర్బల్ గుర్రాన్ని గుర్రపుశాలలో కట్టేయమని ఆదేశించి, వీళ్ళిద్దరిని మరునడు మళ్ళి దర్బారుకి రమ్మన్నాడు.
తెల్లవారింది.
ఇద్దరు దర్బారులో హాజరయ్యారు. బీర్బల్ ఇద్దరిని గుర్రపుశాలకి తీసుకువెళ్ళి, కుంటాడిని, “నీ గుర్రం తీసుకో”, అన్నాడు.
అక్కడ అన్ని గుర్రల మధ్య తనదని వాదించిన గుర్రం తెలుసుకోలేక, బిక్క మొహం వేశాడు.
అదే సామంతరాజు వెంటనే తన గుర్రాన్ని గుర్తుపట్టేడు. గుర్రం కూడ యజమానిని చూసి సంతోశంగా సెకిలించింది.
వెంటనే బీర్బల్ కుంటాడిని శిక్షించమని, గుర్రానికి అసలు యజమాని సామంతరాజు అని, అక్బర్ కి నివేదించాడు.
సామంతరాజు ఎంతో సంతోశంతో తనెవరో చెప్పి బీర్బల్ని ప్రశంసించి  మళ్ళి తన రాజ్యానికి బయలుదేరాడు.

8. బీర్బల్ ఖిచడి :-

      
            ఒక రోజు అక్బర్, బీర్బల్ తోటలో విహరిస్తుంటే ఒక బీద బ్రాహ్మడు ఎదురుపడ్డాడు. అతను అక్బర్ మహారాజును చూసి ఇలా మొరపెట్టుకున్నాడు.
“మహారాజా,  నేను మా కుమార్తెకి పెళ్ళి చేయాలనుకుంటున్నాను. పెళ్ళికి ఊరి జనాలందిరిని పిలిచి, భోజనం పెట్టి, మా అమ్మాయికి నగలు పట్టువస్త్రాలు పెట్టి, ఘనంగా సాగనంపాలన్నది  నా కొరిక. దీనికి నాకు వెయ్యి వరహాలు కావాలి. సంపాదించే మార్గం చెప్పండి”, అన్నాడు.
అక్బర్ మహారాజు ఆశ్చర్యపోయాడు. “నిన్ను చూస్తే చాలా బీద వాడిలా ఉన్నావు, నీ తాహతకు తగ్గట్టు పెళ్ళి చేయవచ్చు కదా, ఇంత ఘనంగా చేయాల్సిన అవసరం యేముంది?”, అని అడిగాడు.
“నాకున్నది ఒకటే బిడ్డ, ఇది నా జీవిత ఆశయం, సొమ్ము సంపాదించే మార్గం చెప్పండి మహారాజా”, అని బ్రాహ్మడు జవాబు చెప్పాడు.
అక్బర్కి బ్రాహ్మడు ఇలా తాహతుకి మించి పెళ్ళి చేయడం నచ్చలేదు. అతనికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. తోట మధ్యలో ఒక చెరువు వుంది. “రాత్రంతా ఆ చెరువులో నిండా మునిగి నుంచుంటే నీకు వెయ్యి వరహాలు ఇస్తాను”, అని షరతు పెట్టాడు.
ఇప్పడిదాకా పక్కన నిశ్శబ్దంగా నిలపడి మాటలు వింటున్న బీర్బల్ ఆశ్చర్యపోయాడు. “మహారాజా! ఈ చలిలో బ్రాహ్మడు రాత్రంతా నీళ్ళల్లో నిలుచుంటే ప్రాణాలు పోకొట్టుకుంటాడేమో” అని అన్నాడు
దానికి బ్రాహ్మడు, “పరవాలేదు స్వామి, నేను నుంచుంటాను, నాకు వెయ్యి వరహాలు సంపాదించడానికి వేరే మార్గాలు యేమీ లేవు” అని బదులు చెప్పాడు.
రాత్రి అక్బర్ భటుల పర్యవేక్శణలో బ్రాహ్మడు చెరువులో మెడదాకా మునిగి నుంచున్నాడు.
తెల్లవారగానే అక్బర్, బీర్బల్ ఉత్సుకతతో చెరువు దగ్గిరకి వచ్చారు. భటులు బ్రాహ్మడిని నీటిలోంచి బయటికి లాగేరు.
బీర్బల్కి చాలా అశ్చర్యం చెందింది. “వృద్ధ బ్రాహ్మడా, ఇంత చలిలో రాత్రంతా యెలా నీటిలో నిలబడ్డావు?” అని అడిగాడు.
“రాత్రంతా దూరంగా కోటలో వెలుగుతున్న లాంతరలని చూస్తూ వాటి వెచ్చతనం తగులుతున్నట్టు ఊహించుకుంటూ నిలపడ్డాను స్వామి” అని ఆ బ్రాహ్మడు బదులు చెప్పాడు.
ఇది విన్న అక్బర్కి కోపం వచ్చింది. “అయితే నువ్వు మన షరతును ఉల్లంఘించావు. మా కోటలోంచి వస్తున్న వేడిని ఆనందిస్తూ నిలుచున్నావు. మన షరతును నేను రద్దు చెస్తున్నాను!” అన్నాడు.
ఆశాభంగమయిన బ్రాహ్మడు యేమి చేయాలో తెలియక, అక్బర్ మహారాజుతో వాదించలేక, నిరాశతో వెళ్ళిపోయాడు.
బీర్బల్కి ఇది చాలా అన్యాయం అనిపించింది. అక్బర్కు తెలిశేలా చెయ్యాలని నిశ్చయించుకున్నాడు.
మరునాడు అక్బర్ మహారాజుని బీర్బల్ తన ఇంటికి భోజనానికి పిలిచాడు. “మహారాజా నేను ఖిచడి చాలా బాగా చేస్తాను, మీరు ఇవాళ సాయంత్రం మా ఇంటికి వచ్చి రుచి చూడవలను” అని ఆహ్వానించాడు.
అక్బర్కు బీర్బల్ ఆహ్వానించే పద్ధతి బాగా నచ్చింది. “తప్పకుండా వస్తాను” అని మాటిచ్చాడు.
సాయంత్రం అక్బర్ తన మంత్రులతో, భటులతో బీర్బల్ ఇంటికి వెళ్ళాడు. బీర్బల్ చాల మర్యాదగా లోపలికి తీసుకుని వెళ్ళి, అక్బర్ని ఒక పీటపై కూర్చోపెట్టి, అతని ముందర పళ్ళెం మంచినినీళ్ళు సర్ది, “పెరట్లో వంట చేస్తున్నాను, ఇప్పుదే ఖిచడి తీసుకుని వస్తాను”, అంటూ మాయం అయిపోయాడు.
అక్బర్ కొంత సేపు ఒపిక పట్టాడు. కాని యెంత సేపయినా బీర్బల్ మళ్ళి రాలేదు. కొంచం సేపటికి బీర్బల్ యేమి చేస్తున్నాడు, అని కోపంగా బీర్బల్ను వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్ళాడు.
అక్కడ బీర్బల్ ఒక చెట్టుకింద నిప్పు పెట్టుకుని కూర్చున్నాడు, కాని నిప్పు మీద వంట పాత్ర యేది లేదు.
“బీర్బల్! యేమి చేస్తున్నావు! ఇదేనా నువ్వు మాకు చేసే మర్యాద!” అని అక్బర్ కోపంగా అడిగాడు.
“మహారాజా! కోపగించుకోకండి! నేను వంట చేస్తున్నాను!” అన్నాడు బీర్బల్.
” ఎక్కడ చేస్తున్నావు? వంట పాత్రలు యేవి?” అన్నారు అక్బర్.
“అదుగో మహరాజ”, అని బీర్బల్ పైకి వెలుపెట్టి చూపించాడు. చెట్టుపైన కొమ్మకు తాడుపెట్టి ఒక కుండ వేళాడతీసి వుంది.
అక్బర్కు అరికాలి మంట నెత్తికి యెక్కింది. అసలే ఆకలి, ఆ పయిన ఇది.
“ఇంత దూరంగా కడితే దానికి మంట యెలా చేరుతుంది, ఖిచడి యెలా ఉడుకుతుంది?” అని క్రోధంగా అరిచాడు.
“అదేమిటి మహారాజా, అలా అంటారు? నిన్న బ్రాహ్మడికి చెరువులో నుంచున్నా యెక్కడో దూరంగా ఉన్న కోటలో వెచ్చతనం తగిలింది కదా, ఈ కుండకు కూడ అలాగే తగులుతుంది,” అని అమాయకంగా జవాబు చెప్పాడు బీర్బల్.
వెంటనే అక్బర్ తన తప్పును గ్రహించాడు. బీర్బల్ యుక్తికి మెచ్చి వెంటనే బీరల్ను ప్రశంసించాడు.
తెల్లారగానే ఆ బ్రాహ్మడికి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.
బీర్బల్ అక్బర్ని, ఆయిన మంత్రులని, భటులనీ లోపలకి తీసుకుని వెళ్ళి ఖిచడితో పాటు పంచభక్ష్య పరవాన్నాలు వడ్డించి సత్కరించాడు.
మొన్నాడు అక్బర్ ఆ బ్రాహ్మడిని కోటకు పిలిచి, క్షమాపణ అడిగి, వెయ్యి బదులు రెందు వేల వరహాలు, పట్టు వస్త్రాలు ఇచ్చి మర్యాదగా మాట నిలపెట్టుకున్నాడు.
బ్రాహ్మడు తన కొరికమేర కు కూతురి పెళ్ళి ఘనంగా చేసి ఆ అమ్మయిని సంతోశంగా అత్తారింటికి పంపించాడు.

9. బీర్బల్ కాకి లెక్కలు :-


ఒక రోజు అక్బర్, బీర్బల్ వేటకి వెళ్ళారు. అడవి లో చాలా కాకులు కనిపించాయి. ఆ కాకులను చూసి అక్బర్ మహారాజుకి ఒక ఆలొచన వచ్చింది.
సరదాగా బీర్బల్ తెలివిని పరీక్షిద్దం అనుకున్నారు. వెంటనే తన పక్కన వున్న బీర్బల్ వైపుకు తిరిగి, “బీర్బల్, మన రాజ్యంలో ఎన్ని కాకులు వున్నాయి?” అని అడిగారు.
బీర్బల్ రెప్ప ఆర్చకుండ వెంటనే “సామ్రాట్, మన రాజ్యంలో సరిగ్గా తొంభై తొమ్మిది వేల, ఆరు వందల నలభై మూడు కాకులు వున్నాయి” అని బదులు చెప్పరు.
ఆశ్చర్య పోయిన అక్బర్ మహారాజు, “అంత కచ్చితంగా చెబుతున్నావు, అంతకన్నా ఎక్కువ కాకులుంటే?” అని అడిగారు.
“అయితే పక్క రాజ్యాలనుంచి మన రాజ్యంలోని కాకుల చుట్టాలు వచ్చినట్టు” అన్నారు బీర్బల్.
“ఒక వేళ తక్కువ వుంటే?” అని అడిగారు అక్బర్
“అయితే మన రాజ్యం కాకులు వాళ్ళ చుట్టాలని కలవడానికి వెళ్ళినట్టూ!” అని చెప్పారు బీర్బల్.
ఈ కథను ఈ రోజు వరకు బీర్బల్ తెలివితేటలకు, స్థిత ప్రగ్న్యతకు ఉదాహరణగా చెప్పుకుంటారు. నిజమే, తెలివిగా అక్బర్ మహారాజు వేశిన చిక్కు ప్రశ్నకు జవాబు చెప్పారు కద! మీరేమంటారు?




No comments:

Post a Comment